మైదానంలో చిచ్చరపిడుగు.. గదిలో మాత్రం చిన్న పిల్లాడే.. వైభవ్ సూర్యవంశీ స్పెషల్ స్టోరీ!

  • ఐపీఎల్ 2026లో సత్తా చాటుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
  • 600కు పైగా పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యంగ్ ప్లేయర్
  • ఎంత ఒత్తిడి ఉన్నా మానసిక ప్రశాంతత కోసం కార్టూన్లు చూస్తానని వెల్లడి
  • గత సీజన్‌లోనే తొలి మ్యాచ్‌ తొలి బంతికే సిక్స్.. మూడో మ్యాచ్‌లోనే సెంచరీతో రికార్డ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక పేరు మార్మోగిపోతోంది. అతనే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రా, కమిన్స్, హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ 'ఫియర్‌లెస్ ప్రాడిజీ' అనే పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో ఇంతటి పరిణతి చూపిస్తున్నా, గదిలోకి వెళితే మాత్రం అతను ఇప్పటికీ కార్టూన్లు చూసే ఓ చిన్న పిల్లాడే.

తన ఈ అలవాటు గురించి వైభవ్ స్వయంగా వెల్లడించాడు. జియో‌స్టార్‌తో మాట్లాడుతూ.. "రెండేళ్ల క్రితం ఇంట్లో ఉన్నప్పుడు మ్యాచ్‌లు ఆడినా, ప్రాక్టీస్ చేసినా ఖాళీ సమయం దొరికితే కార్టూన్లు చూసేవాడిని. అది నాకు చాలా ఆనందాన్నిచ్చేది. ఇప్పటికీ నాకు మానసిక ప్రశాంతత కావాలనిపించినా, కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నా కార్టూన్లు చూస్తాను. గదిలో సౌకర్యంగా కూర్చుని నాకు నచ్చిన కార్టూన్లు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అచ్చం ఇంట్లో ఉన్న భావన కలుగుతుంది" అని తన మనసులోని మాటను పంచుకున్నాడు.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఈ యువ ప్రతిభను గుర్తించింది. రూ.1.10 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ.. "వేలం దుబాయ్‌లో జరుగుతున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ట్రయల్స్ తర్వాత టీమ్ మేనేజర్ రోమి భిందర్ సర్ నాకు ఫోన్ చేసి, నన్ను కొనుగోలు చేయబోతున్నట్లు చెప్పారు. వేలంలో కొన్నాక ఫోన్ చేసి అభినందనలు తెలిపారు" అని చెప్పాడు.

గత సీజన్‌లో అరంగేట్రం చేసిన వైభవ్, ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటాడు. ఆడిన మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తన కుటుంబానికి, తనకు గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్న వైభవ్, తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు.

Vaibhav Suryavanshi
IPL 2026
Rajasthan Royals
Indian Premier League
Cricket
Orange Cap
Batting
Eliminator Match
Sunrisers Hyderabad
Gujarat Titans

More Telugu News